మార్పు
కాల చక్రం మారుతుంది
నేడు నిన్నగా
రేపు నేడుగా
సమాజం మారుతుంది
పల్లె పట్టణం వైపు
పట్టణం ప్రపంచీకరణ వైపు
ప్రకృతి మారుతుంది
ధరిత్రి దేహాన్ని
కాలుష్యంతో కోస్తున్నపుడు
ప్రవర్తన మారుతుంది
అనుభవం పాఠం నేర్పినపుడు
అవసరం అనివార్యమైనపుడు
మనసు మారుతుంది
కనుగుడ్ల కమ్మిన కన్నీళ్ళకు
కారణం నేనే అనుకొన్నపుడు
మానవత్వం మారుతుంది
మతంముసుగులో
మనసు చంపుకొన్నపుడు
అత్మీయత మారుతుంది
ఆర్ధిక అద్దంలో
అయినవాళ్ళను చూసినపుడు
వర్తమానం మారుతుంది
గతం చేసిన గాయాలకు
భవిష్యత్ భయం అద్దినపుడు
మనిషి మారుతున్నాడు
స్వార్ధం మాటువేసి
నిరపరాధిని కాటువేసినపుడు
మార్పు జీవితాంతం
మార్పు జీవనసారం
మార్పు ప్రకృతినైజం
మార్పు మానవసహజం
నేను మాత్రమే మారలేకున్న
నీ నుండి…..నీకిచ్చిన మాటనుండి